Posts

Showing posts from November, 2017
ఉ. దీక్ష తితీక్ష వీక్షయును తీవ్రతరంబగు కాంక్షయున్ లలా  టాక్షుని లేశమాత్రపు కటాక్షమునక్షర శిక్ష బోధలున్  మోక్షము పొంద గోరిన ముముక్షుని కిచ్చును దక్షతన్, సదా  సాక్షిగ తక్షణమ్ము తన చక్షువు చూచునలక్షణుండుగా/నై..కోట శర్మ తితీక్ష = సహనము, వీక్ష = దృష్టి ( విశేష దృష్టి ), అక్షర శిక్ష = బ్రహ్మతత్వము, దక్షత = నేర్పు, చక్షువు = జ్ఞాననేత్రము. వివరణ: దృఢ సంకల్పము, సహనము, నిత్యానిత్య వివేకము ( విశేష దృష్టి ), తీవ్రమైన మోక్షకాంక్ష, ఫాలనేత్రుని కృప మరియు సద్గురు బ్రహ్మతత్వ ( శ్రుతివాక్య) బోధలూ ముముక్షువుకు తనను అలక్షణుడు, అవ్యవహార్యమైన సాక్షిగ తెలుపు అనుభవజ్ఞానము కలుగుటకు అర్హతను/ నేర్పును కలిగించును.
మత్తేభవిక్రీడితము శివునర్చించగ చిత్తశుద్ధి కలుగున్ సేవించు దాసుండవై  శివనామస్మరణమ్ము జేయుమెపుడున్ సిద్ధించునేకాగ్రతన్  శివమే నేనను వేదవాక్కు మదిలో చింతించుమెల్లప్పుడున్ భవబంధమ్ములు నిన్ను వీడునిక జీవన్ముక్తి సంప్రాప్తమై వివరణ: కర్మోపాసనలవలన కలిగే చిత్తశుద్ధి, ఏకాగ్రతలు ఆత్మవిచారణకు సాధనములు. ఈరెంటినీ సాధించిన సాధకుడు, శ్రుతి వాక్యములను శ్రవణ మననాదుల ద్వారా విచారించి, నేనే బ్రహ్మము నన్న స్ఫురణతో నిరంతరము నిధిధ్యాసన చేయగా బ్రహ్మానుభూతి సిద్ధించును.  శివము అనగా సర్వ మంగళమైన పరమాత్మ (మాండూక్యోపనిషత్ ).
మాపుమ మాపురమ్మున నుమాపతి! మాపును రూపుమాపుమా! మాపరమాత్మవీవె వినుమా పరమేశ్వర! మాపురేపులున్  మాపురమందు గొల్చెదము మాపుమ చూపున నామరూపముల్  చూపును చూచునట్టి సరిచూపును చూడగ దారి చూపుమా!.. మాపు = పోగొట్టు, మాలిన్యము  పురము = శరీరము ( స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు) మాపురేపులు = రేయింబవళ్ళు వివరణ: పరమాత్మ తత్వమూర్తియైన ఉమాపతీ! మా చిత్తమాలిన్యమును నిర్మూలించుమా. అహర్నిశలు మామదిలో నిన్ను స్మరించెదము. దృష్టిదోషమువలన కలిగిన ( ఆభాసా జనిత) నామరూపములను లయము జేయుమా. సర్వసాక్షియైన (సమస్త దృశ్యములకు దృక్కయిన) పరమాత్మానుభూతి కలిగించుమా.
ఛాందోగ్యోపనిషత్సారము  బ్రహ్మాన్వేషికి జ్ఞాతమౌ తొలుత సర్వం ఖల్విదం బ్రహ్మ గా  బ్రహ్మమ్నాత్మగ చూపు సద్గురువు తత్బ్రహ్మ్మమ్ము నీవేయనిన్  బ్రహ్మాండమ్ముయు నాత్మగానవగతంబౌనంతనా జ్ఞానికిన్  బ్రహ్మజ్ఞానికి తోచునంత సకలంబా సచ్చిదానందమై
కం. త్రినయన! మునిజన వినుతా! అనఘా! శమన దమన! మదనాంతక! పంచా  నన! నయనాయుధ! నను గన  మననము చేసెద ననయము మనమున నిన్నే కం. సాంబ! శుభంకర! శంకర! అంబాపతి! అంబరీష! అంతకహంతా! త్ర్యంబక! కల్మషకంఠ! ది  గంబర! శంభో! పురాంతకా!వందనముల్..
ముక్కంటిని వేడుకొంటి🙏 ఉత్పలమాల  కంటిని వేడికంటి నిలకంటికి రెప్పగ గావుమంటి, ము  క్కంటిని వేడుకొంటి నడుగంటగ గంటిని, నమ్మియుంటి చి  క్కంటిగ నింటిమింట తిగకంటియె గ్రంథిని మంటబెట్టగన్ కంటిని వెంటనంటి కఱకంఠుని నొంటిగ, నొండు లేదనిన్..కోట శర్మ పద్యములో వాడబడిన శివుని నామములు: వేడికంటి, ముక్కంటి, తిగకంటి, కఱకంఠ. అడుగంటు = క్షీణించు, నాశనమగు; గంటి = దుఃఖము ; చిక్కంటి = తలలో చిక్కుముడి తీసే నిడుపు దువ్వెన; ఇంటిమింట= ఇంటియొక్క మింటిలోనున్న, ఇల్లు అనగా దేహము, మింటి = ఆకాశము .... అనగా హృదయాకాశములోనున్న; గ్రంధి = చిక్కు ముడి అనగా అజ్ఞానము; మంటబెట్టు = తొలగించు; వెంటనంటి= వెంబడించి అనగా ఆశ్రయించి; ఒంటిగ = ఒక్కడేనని ( అద్వయమని) ; ఒండులేదనిన్ = ఇతరమేదీలేదని. భావము: శివుని దర్శించి కంటికిరెప్పగ కాపాడమని కోరుకొంటిని. దుఃఖమును పోగొట్టమని వేడుకొంటిని. శివుడే తలలో చిక్కుముడిని తీసివేసే దువ్వెనలాగా నా హృదయగ్రంధులను ( చిక్కుముడి వంటి అజ్ఞానమును) తొలగిస్తాడని నమ్ముకున్నాను. శివునాశ్రయించి సర్వమూ శివమయని, ఉన్నదంతా ఆయనొక్కడేనని, వేరేమీలేదని తెలుసుకున్నాను.
దేహమ్మన్నది మత్స్వరూపమను భ్రాంతిన్ నాశమొందించగా నాహం దేహమటంచు సంతతము ధ్యానావస్థయందుండగన్ కోహమ్మన్న విచారణల్ తనను నేకోహమ్ముగా చూపగా సోహం స్వానుభవమ్మగున్, విదితమౌ శ్రుత్యుక్తి మోక్షార్ధికిన్..కోట శర్మ కం. కలదని యందురు కొందరు, కలయని మరియొకరి మతము, కనికట్టుగనే కలదని వేరొకరందురు, కలదో లేదో కనుగొన గలమా కలలో?..కోట శర్మ మాయయెలీలచేయగ నమాయకమానవు లాడుచుందురా మాయయె నిక్కమన్నటుల మైకములోబడి యాటబొమ్మలై మాయము జేయ మాయనిక మాయమె మాయలమారి చేతలే మాయను స్వప్నలోకము సమాధిన? సర్వము మాయమౌగదా చంపకమాల  పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్  నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్  కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్  తలచెద నీదు తత్త్వమును తత్త్వము నేనగుచున్ తరించగన్ కం. హరహర! శరణ్య! భవహర! సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే  శ్వర! గిరివర! పరమ పురుష! శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా! మత్తకోకిల  శూలపాణిని చంద్రచూడుని సోమనాథుని భర్గునిన్  ఫాలనేత్రుని భూతనాథుని పార్వతీశుని శంభునిన్  కాలకంఠుని లింగమూర్తిని కాలకాలుని రు...
ఉ. కర్మల నాచరించుటకు కారణమా శివ శక్తి మాయయే కర్మల  బంధనమ్ములకు కారణమయ్యెను ధర్మ మూర్తియై మర్మము తెల్పి సంచితము మాయము చేయును వేద వేద్యయై శర్మము సత్తుచిత్తులుగ సర్వము తెల్పును ముక్తి దాతయై.. కోట శర్మ కం 106.జననీయని జగదంబను జనులందరు శరణువేడ సతతమ్మిలలో కనిపించని పరతత్వమె కనపించెడి దుర్గ మాతగాదిగి వచ్చెన్ 107.అమ్మలకమ్మగ నిన్నే నమ్మితి నమ్మా మనమున నామస్మరణ మ్మిమ్ముగ చేసెద జ్ఞానము నిమ్మని కోరుచు ననయము నిన్నే జననీ 108. తవచరణము మమ శరణము భవతీ నీకరుణకోరి భవహరణముకై సవినయముగ వినుతించెద శివశంకరి విజయవాడ శ్రీదుర్గమ్మా!
తత్వమసి స్వామి వివేకానందుడి  దృష్టాంతము ఆధారంగా మత్తకోకిల 102.తల్లినుండొక పిల్ల సింహము దారి తప్పగ దూరమై వెళ్ళిచేరెను గొర్రెమందన భీతితో విలపించుచున్ యెల్లవేళల గొర్రెగా బ్రతుకీడ్చు చుండెను మందలో నల్లవేరొక సింహమావిషయమ్ము చూసెను వింతగన్ చెంతచేరెను పెద్దసింహము చిన్నగా కడు ప్రీతితో “చింతలెందుకు నీదురూపము సింహమే”నని చెప్పుచున్ భ్రాంతినంతము చేయ సింగపు బల్మి తీరులు తెల్పగన్ స్వంతరూపము గన్న చిన్నది సంతసించెను సింహమై ఉన్న శక్తిని విస్మరించగ నుత్తగొర్రెగ నున్ననా చిన్నసింహపు చందమున్ మరచేను జీవుడు తత్వమున్ ఖిన్నుడయ్యెనవిద్యచే పరికించకన్ తన రూపమున్ విన్నయే పరమౌషధమ్మవివేకమంతము చేయగన్ విన్న = విజ్ఞ వివరణ: ఒక సింహము పిల్ల దారి తప్పి జింకలగుంపులో చేరి తను సింహానినన్న విషయము మరచి జింకలలాగా భయపడుతూ బ్రతుకుతూ ఉంటుంది. కొన్నాళ్ల తరువాత దానిని వేరేసింహము చూసి దానికి సరస్సు నీటి లో దాని ప్రతిబింబము చూపి దాని అసలుస్వరూపము తెలియజేస్తుంది. తన నిజస్వరూపజ్ఞానము కలిగాక అది సింహములా ధైర్యంగా బతుకుతుంది. ఇక్కడ దాని అసలు స్వరూపమెప్పుడూ సింహమే. కాని అజ్ఞానము వలన కలిగిన అపోహ వలన జింకలా బ్రతకాల...
నలువిధమ్ముల దేవునర్చింత్రు ధరణిలో సద్భక్తు లైనట్టి సత్పురుషులు చింతలున్నప్పుడె చింతించు చిత్తము నార్తరక్షకుడంచు నార్తుడొకడు నైశ్వర్యమాసించి యీశ్వరునర్చించు నట్టిద్వితీయుడర్ధార్ధియితడు జిజ్ఞాసు ధ్యానించు సుజ్ఞాన సిధ్ధికై దేవభక్తులలో తృతీయుడితడు జ్ఞానమెరిగిన భక్తుడే జ్ఞాని యగును నిత్య సత్యమునెపుడు ధ్యానించు చుండు యోగిగాపరమాత్మతోయుండు నెపుడు భక్తులందుత్తముడు ప్రియ భక్తుడితడు భగవద్గీత 7.16 & 17 చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినో అర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ || తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే | ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః || తాత్పర్యం ” భరత శ్రేష్ఠా ! ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని … ఈ నాలుగు విధాల మనుష్యులే ‘ నన్ను ’ ‘ ఆత్మ ’ ను సేవిస్తున్నారు. “ ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు.అటువంటి వాడికి నేను ఎక్కువ ప్రియుణ్ణి.అతడే నాకు కూడా ఇష్టుడు.
Bhajagovindam in Telugu ( In Dvipada) భజియించు గోవిందు -భజియించు సతము     త్యజియించి మోహమున్ - దరియించు భవము 56.వీడుమత్యాశను -విత్తార్జనమున      వీడుమాశలనెల్ల- విమలచిత్తమున      సరియైన రీతిలో -సంపదల్ పొంది       పరితుష్టి కలిగుండు -బాధలన్ వీడి     స్మరియించు గోవిందు -సద్భక్తి తోడ     హరియించు పాపము-లామూలముగను  57. వ్యామోహ మొందకు -మతివలను గని     యేమార్చు మాంసాదు- లీయందమంత     తనువు హేయమ్ముగా -దలచి నీవెపుడు     మనసులో చింతించు- మరువకెన్నడును     భక్తితో గోవిందు -భజియించు సతము     ముక్తికలుగు నీకు -మోహమ్ము తొలగి 58.తామరాకుననీరు -తలకు చందమ్ము     గా మనిషి బ్రతు-కతి చంచలమ్ము    చింతలపోహలే-జీవితమంత     సంతోషమేలేదు- స్వల్పమైనగన     శరణువేడుముసదా -సర్వాత్మకుడిని     మరుజన్మ తొలగించు- మార్గమున్ దెలుపు 59. ధనమును గడియించు -దనుకనీ పైన     ననురాగ మునుచూపు -నాప్తులైనటుల ...
గణముల కాధిపత్యమునకై తలిదండ్రుల గొల్చి యుక్తితో గణపతు డయ్యె; దంతమును ఘంటము జేసి రచించె భారత మ్మును హరకేశవప్రియుడు; మూషిక వాహనుడైన పార్వతీ తనయుడి గాధలందుగల తత్త్వము నెర్గుము తారకమ్మిదే! వింత వింతలు వృత్తాంత మంతయున్ను వింతరూపచింతనమున సంతతమ్ము చెంతచేరినంత యనంత సంతసించు నంతరాయములాసాంతమంతరించు
Bhakthitho..... విన్నాడను నేబోధలు కన్నాడను విన్నుడైన కన్నయ్యను నా కన్నయ్యని మాటలలో విన్నాణము సన్నుతించి వెన్నుని మదిలో గీత బోధలొసగి గిరిధారి కృష్ణయ్య రాత మార్చుకొనెడి ఊతమిచ్చె వెన్న దొంగిలించి విన్నాణమందించె వెన్న దొంగ విద్య విన్న మిన్న వెన్నదొంగకు చక్రధారికి వేణులోల మురారికిన్ చిన్నికృష్ణకు దేవకీసుత  చిద్విలాసకు యోగికిన్ వెన్నుడున్ వటపత్రశాయికి వేదవిద్యల దాతకున్ విన్నవించెద సన్నుతించెద వేయి మారులు భక్తితో ధవళ దేహి! ధవళ వస్త్రధారి! విష్ణు! శాంత మూర్తి! చతుర్భుజి! శంభు సుతుడు శ్రీవినాయకుడికి మ్రొక్క శిరము వాల్చి విఘ్నములు తొలగునెపుడు విజయమగును ఈశపుత్ర వక్రతుండ యేకదంతుడానమో! క్లేశహారి విఘ్నరాజ కేశవప్రియా నమో! పాశబంధ నాశకారి పాపనాశకానమో! పాశహస్త ఫాలచంద్ర పాహిమామ్ వినాయకా! సర్వజనావళి శాంతిని కోరెన్ పార్వతి బొమ్మకు ప్రాణము పోసె న్నుర్విన విష్ణుడి యుద్భవమయ్యెన్ సర్వగణాలకు శాసకుఁడయ్యెన్ ఈశపుత్రుకు వక్రతుండుని కీశనమ్ముల దాతకున్ పాశహస్తుకు ఫాలచంద్రుకు ఫాలనేత్రుకుమారుకున్ క్లేశహారికి విఘ్నహంత్రుని కేకదంత గణేశుకున్ కేశవప్రియు కగ్రగణ్యుడి కెల్లవేళల మ్రొక్కె...
Saranu Durga!  in Ataveladulu దుర్గ యనిన సకల దుర్గతుల్ తొలగును      దుర్గ యనగ సకల దురిత హారి      దుర్గ యనగ సకల దుఃఖనివారిణి      కరుణ చూపు తల్లి కనక దుర్గ కనకదుర్గ మల్లికార్జునులిద్దరు      అమ్మవారి తోడ నయ్య వారు      కొండ మీద మనకు నండగా నుండిరి      కరుణ చూపు తల్లి కనక దుర్గ జయము జయము నీకు జగములకు జనని     జయము నిన్ను గొల్చు జనులకెపుడు     జయము ధర్మమునకు జననినీవుండగన్     కరుణ చూపు మమ్మ కనక దుర్గ శరణు వేడు కొందు శ్రద్ధతో యమ్మను     చరణ పద్మములకు శిరము వాల్చి     హరణమౌను నిక్కమన్ని దురితములు     కరుణ చూపు తల్లి కనక దుర్గ కోట్ల భక్త జనుల కోర్కెలు తీర్చంగ     నింద్ర కీల గిరిని యిల్లు చేసి     విజయ వాడ లోన వెలసెను దుర్గమ్మ     కరుణ చూపు తల్లి కనక దుర్గ ఆది శక్తి దుర్గ యాద్యంత రహితము     నాది శక్తి!  కొలిచి నంత నిన్ను     నాది లేని దుఃఖ మంతమౌ మెదలంట ...
కనిపెంచిన తలి దండ్రులు        కనిపించెడి దేవతలుగ గ్రహియించు సుమీ!        కనిపించని దేవతలను        వినుతించిననేమొరగదు వీరే దూతల్! కం. తిలకించక సత్యమ్మును,        గలహించుచు, కష్టములను గలిగించినచో        తలిదండ్రులు కలవరపడి        విలపించిన నీదు బ్రతుకు వికటించు సుమా! అల్లరి పిల్లల తల్లికి నల్లట లెల్ల తనపిల్లలల్లరి వల్లన్! పిల్లల కల్లలు తల్లికి నల్లట, పిల్లలకువల్లదల్లరి యెల్లన్ తెలుగు భాష జనుల తెలివి తేటలు పెంచు ధారణందు చిక్కు పూరణందు నన్ని భాష లందు నవధానముండునా తెలుగు పద్యమన్న తేనెలూరు
అందరి కందుల చిందులు అందని యానందమునకె -అందిందున్ ఆ నందము పొందదగదు నీ డెందమె నందముగనుండెడిది సతతమ్మున్ పదుగురు శిష్యులు నీదుచు నదమున కావలి తటమ్మునకు చేరగ నా నదిలో మునిగెనొకడనుచు పదుగురు యేడ్చిరి గణించి పలు విధములుగన్ తనను విడిచి తక్కిన వా రిని పలు మారులు గణించిరి యని గని హితుల్ కనపడని పదవ వానిగ తననే చూపగ నెరింగి దక్కెననుకొనెన్ తనను విడిచి వెదికిన దొర కని పదవ సహచరుని వలె కనలేమాత్మన్ తను కనుగొన దలచిన నా త్మను తానేయని యెరింగి తననరయదగున్ తలపులె మనుజుల తగువులు తంటల్ తలచిన తడవునె తమసును పెంచున్ తలచెడి దెవరని తలచిన  పోవున్ తలపులు తొలగిన తమకము పోవున్ ఆలోచన యనిన -నక్కడ లోచన  మాలోచనే యాన-మత్తరికిని నాలోచనేయగు -నావేశతాపాదు  లాలోచనేయగు-నారు యరులు నాలోచనేహేతు-వన్ని కష్టములకు  నాలోచనేశత్రు -వందరికిని నెల్లపుడుండిన -నిప్పుడే యిక్కడే  యన్ని యాలోచన-లంత మగును తలపులె మన కన్ని-తంటలనిచ్చును తలచు వాడెవరని  -తలచిన తన తలపులు తొలగునని -తలచుచు మనసుకు తలుపు మూయ దగును -తక్ష ణంబు తలపులె మనుజుల కలతలు తలచిన తడవునె  మనమున తమసును పెంచున్ తలచెడి ...
వేదమార్గము జ్ఞానమేనని వేయిసూక్తులు వ్రాసెడిన్ ఆదిలేనిది యంతులేనిది యంతటున్నది యొక్కటే భేదభిన్నము లేనెలేదని భేరిగావిని పించెడిన్ ఆదిశంకర లోకమంగళ యార్షసద్గురవే నమో తనువే తానుగ తలచెడి మనసే కారణము జనన మరణమ్ములకున్ తనలో తలపులు నిలుపగ మన మనసే ముక్తినిచ్చు మార్గము చూపున్ మెలకువ నిదురయు కలలను       త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో       మెళుకువతో లోకమ్ములు       తిలకించగ విదితమగును తీరు తరింపన్ కం. మెలగును తనువును  మనసును        మెలకువలో, మనసొకటియె మెదలును కలలో        కలిపించి లేని జగతిని,        కలలుకనని నిదురలోన కనబడ వేవీ!  కం. మెలకువ లో కనబడునవి        కలలో నుండవు, కలిగిన కల కనుమరుగౌ        మెలకువలో, మాయమగు స        కలము నిదురలో, సకలము కనునది నీవే