దేహమ్మన్నది మత్స్వరూపమను భ్రాంతిన్ నాశమొందించగా
నాహం దేహమటంచు సంతతము ధ్యానావస్థయందుండగన్
కోహమ్మన్న విచారణల్ తనను నేకోహమ్ముగా చూపగా
సోహం స్వానుభవమ్మగున్, విదితమౌ శ్రుత్యుక్తి మోక్షార్ధికిన్..కోట శర్మ
కం.
కలదని యందురు కొందరు,
కలయని మరియొకరి మతము, కనికట్టుగనే
కలదని వేరొకరందురు,
కలదో లేదో కనుగొన గలమా కలలో?..కోట శర్మ
మాయయెలీలచేయగ నమాయకమానవు లాడుచుందురా
మాయయె నిక్కమన్నటుల మైకములోబడి యాటబొమ్మలై
మాయము జేయ మాయనిక మాయమె మాయలమారి చేతలే
మాయను స్వప్నలోకము సమాధిన? సర్వము మాయమౌగదా
చంపకమాల
పిలిచెద నీశ్వరా! వినుమ విజ్ఞత నాకును సంతరించగన్
నిలిచెద నీదు ధ్యానమున నిత్యము నిన్మదిలో స్మరించగన్
కొలిచెద నీదు రూపమును కోరికలన్నియు నంతరించగన్
తలచెద నీదు తత్త్వమును తత్త్వము నేనగుచున్ తరించగన్
కం.
హరహర! శరణ్య! భవహర!
సురగణ వినుత! భుజగధర! శుభకర! పరమే
శ్వర! గిరివర! పరమ పురుష!
శరణు దురిత హర! హరినుత! శశిధర కనరా!
మత్తకోకిల
శూలపాణిని చంద్రచూడుని సోమనాథుని భర్గునిన్
ఫాలనేత్రుని భూతనాథుని పార్వతీశుని శంభునిన్
కాలకంఠుని లింగమూర్తిని కాలకాలుని రుద్రునిన్
శైలవాసుని సన్నుతించెద సర్వదా స్మరియించుచున్
Comments
Post a Comment