Bhakthitho.....
విన్నాడను నేబోధలు
కన్నాడను విన్నుడైన కన్నయ్యను నా
కన్నయ్యని మాటలలో
విన్నాణము సన్నుతించి వెన్నుని మదిలో
గీత బోధలొసగి గిరిధారి కృష్ణయ్య
రాత మార్చుకొనెడి ఊతమిచ్చె
వెన్న దొంగిలించి విన్నాణమందించె
వెన్న దొంగ విద్య విన్న మిన్న
వెన్నదొంగకు చక్రధారికి వేణులోల మురారికిన్
చిన్నికృష్ణకు దేవకీసుత చిద్విలాసకు యోగికిన్
వెన్నుడున్ వటపత్రశాయికి వేదవిద్యల దాతకున్
విన్నవించెద సన్నుతించెద వేయి మారులు భక్తితో
ధవళ దేహి! ధవళ వస్త్రధారి! విష్ణు!
శాంత మూర్తి! చతుర్భుజి! శంభు సుతుడు
శ్రీవినాయకుడికి మ్రొక్క శిరము వాల్చి
విఘ్నములు తొలగునెపుడు విజయమగును
ఈశపుత్ర వక్రతుండ యేకదంతుడానమో!
క్లేశహారి విఘ్నరాజ కేశవప్రియా నమో!
పాశబంధ నాశకారి పాపనాశకానమో!
పాశహస్త ఫాలచంద్ర పాహిమామ్ వినాయకా!
సర్వజనావళి శాంతిని కోరెన్
పార్వతి బొమ్మకు ప్రాణము పోసె
న్నుర్విన విష్ణుడి యుద్భవమయ్యెన్
సర్వగణాలకు శాసకుఁడయ్యెన్
ఈశపుత్రుకు వక్రతుండుని కీశనమ్ముల దాతకున్
పాశహస్తుకు ఫాలచంద్రుకు ఫాలనేత్రుకుమారుకున్
క్లేశహారికి విఘ్నహంత్రుని కేకదంత గణేశుకున్
కేశవప్రియు కగ్రగణ్యుడి కెల్లవేళల మ్రొక్కెదన్
దంతతుండము లెంతయో పరతత్వ భావము తెల్పుచున్
వింతరూపము వీధివీధిన విగ్రహాలుగ నిల్చెగా
స్వంతలాభము కోరికొందరు సత్తుగా మరికొందరు
న్నంతటా వినిపించె దేవ గణాధిదేవుని కీర్తనల్
శుద్ధాంబరమువోలె శుధ్ధాత్ముఁడీతండు
శ్వేతవర్ణము దెల్పు చేతనమ్ము
నంతరిక్షమువోలె నంతట వ్యాపించు
వేదాంత సత్యమే విష్ణువితఁడు
మూడు గణమ్ములే మూడుగుణమ్ములు
గుణగణాధిపతి నిర్గుణుఁడితండు
నంతరాయమ్ములనంతమ్ము జేసెడి
యాద్యపూజిత సర్వ వేద్యుడితఁడు
బొజ్జ దేవుఁడు దేవతా పూజ్యుడితఁడు
నరసురాసుర సేవ్యుఁడనంతుడితఁడు
నేక దంతుఁడితఁడు గుణాధీశుఁడితఁడు
సిద్ది బుద్ధిప్రదాత సచ్చిత్తుఁడితఁడు
శక్తిరూపిణి ధర్మచారిణి శంకరార్ధశరీరిణీ
భుక్తిదాయిని పాపనాశిని బుద్ధిదాయిని శాంకరీ
ముక్తిదాయిని మంత్రరూపిణి మోహనాశిని పాహిమామ్
భక్తితోనిను వేడుకుందును బంధముక్తికి సర్వదా
Comments
Post a Comment