Bhajagovindam in Telugu ( In Dvipada)

భజియించు గోవిందు -భజియించు సతము
    త్యజియించి మోహమున్ - దరియించు భవము

56.వీడుమత్యాశను -విత్తార్జనమున
     వీడుమాశలనెల్ల- విమలచిత్తమున

     సరియైన రీతిలో -సంపదల్ పొంది
      పరితుష్టి కలిగుండు -బాధలన్ వీడి

    స్మరియించు గోవిందు -సద్భక్తి తోడ
    హరియించు పాపము-లామూలముగను

 57. వ్యామోహ మొందకు -మతివలను గని
    యేమార్చు మాంసాదు- లీయందమంత

    తనువు హేయమ్ముగా -దలచి నీవెపుడు
    మనసులో చింతించు- మరువకెన్నడును

    భక్తితో గోవిందు -భజియించు సతము
    ముక్తికలుగు నీకు -మోహమ్ము తొలగి

58.తామరాకుననీరు -తలకు చందమ్ము
    గా మనిషి బ్రతు-కతి చంచలమ్ము

   చింతలపోహలే-జీవితమంత
    సంతోషమేలేదు- స్వల్పమైనగన

    శరణువేడుముసదా -సర్వాత్మకుడిని
    మరుజన్మ తొలగించు- మార్గమున్ దెలుపు

59. ధనమును గడియించు -దనుకనీ పైన
    ననురాగ మునుచూపు -నాప్తులైనటుల

    నీమేను ముదిమిలో- నీరసించు తరి
    నీమేలు నడుగుచు- నినుజేరరెవరు

    గోవిందు భజియించు -గోప్యమ్ము తెలియ
    కావించ గలదునీ -కాత్మదర్శనము

60.ఊపిరి నీమేన -నున్నంత వరకె
    నీపత్ని సుతులునున్- నిను బల్కరింత్రు

    గాలియాడని మృత- కాయమున్ జూచి
    ఆలుబిడ్డలునైన -హడలిపోవుదురు

    భజియించు గోవిందు -భజియించు సతము
    త్యజియించి మోహమున్ - దరియించు భవము

61.ధనమెల్లపుడును బా-ధలనిచ్చునరయ
     ధన మెట్టి సుఖమీయ-దనియెర్గి యుండు

     ధనవంతులైనను -దనయుల వలన
     వణకుదురంతటన్ -భయపడి యిలను

     భజియించు గోవిందు -భజియించు సతము
     త్యజియించి మోహమున్ - దరియించు భవము

62. చిరుతడి కాటల -చింతన లెపుడు
     తరుణుడు కోరును -తరుణిని సతము

     (బాలుడి కాటల -పాటల చింత
     వాలుగంటి తలపె-ప్రాయమునందు)

     వృద్ధుడు చింతల -వృష్టిలో మునుగు
     శుద్ధాత్మ నెఱుఁగెడి-సుమతులే లేరు

      భజియించు గోవిందు -భజియించు సతము
      త్యజియించి మోహమున్ - దరియించు భవము

63.  సంతానమెవ్వరు -సతి యెవ్వరరయ
      వింతైన దీసృష్టి -వివరించి చూడ

      నీవెవ్వరెచ్చోటు -నీది నిక్కముగ
      నీవిధంబెట్టిద-ని తెలుసుకొనుము

      భజియించు గోవిందు -భజియించు సతము
      త్యజియించి మోహమున్ - దరియించు భవము

వయసు మళ్ళి నంత వాంఛలెచటనుండు
నీరమెండినంత నేరెచటిది
సిరులు వీడి నంత పరివారమెచటిది
పరమ జ్ఞాని కెచట బంధనములు

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్