ముక్కంటిని వేడుకొంటి🙏
ఉత్పలమాల
కంటిని వేడికంటి నిలకంటికి రెప్పగ గావుమంటి, ము
క్కంటిని వేడుకొంటి నడుగంటగ గంటిని, నమ్మియుంటి చి
క్కంటిగ నింటిమింట తిగకంటియె గ్రంథిని మంటబెట్టగన్
కంటిని వెంటనంటి కఱకంఠుని నొంటిగ, నొండు లేదనిన్..కోట శర్మ
పద్యములో వాడబడిన శివుని నామములు: వేడికంటి, ముక్కంటి, తిగకంటి, కఱకంఠ.
అడుగంటు = క్షీణించు, నాశనమగు; గంటి = దుఃఖము ; చిక్కంటి = తలలో చిక్కుముడి తీసే నిడుపు దువ్వెన; ఇంటిమింట= ఇంటియొక్క మింటిలోనున్న, ఇల్లు అనగా దేహము, మింటి = ఆకాశము .... అనగా హృదయాకాశములోనున్న; గ్రంధి = చిక్కు ముడి అనగా అజ్ఞానము; మంటబెట్టు = తొలగించు; వెంటనంటి= వెంబడించి అనగా ఆశ్రయించి; ఒంటిగ = ఒక్కడేనని ( అద్వయమని) ; ఒండులేదనిన్ = ఇతరమేదీలేదని.
భావము: శివుని దర్శించి కంటికిరెప్పగ కాపాడమని కోరుకొంటిని. దుఃఖమును పోగొట్టమని వేడుకొంటిని. శివుడే తలలో చిక్కుముడిని తీసివేసే దువ్వెనలాగా నా హృదయగ్రంధులను ( చిక్కుముడి వంటి అజ్ఞానమును) తొలగిస్తాడని నమ్ముకున్నాను. శివునాశ్రయించి సర్వమూ శివమయని, ఉన్నదంతా ఆయనొక్కడేనని, వేరేమీలేదని తెలుసుకున్నాను.
Comments
Post a Comment