అందరి కందుల చిందులు
అందని యానందమునకె -అందిందున్ ఆ
నందము పొందదగదు నీ
డెందమె నందముగనుండెడిది సతతమ్మున్

పదుగురు శిష్యులు నీదుచు
నదమున కావలి తటమ్మునకు చేరగ నా
నదిలో మునిగెనొకడనుచు
పదుగురు యేడ్చిరి గణించి పలు విధములుగన్

తనను విడిచి తక్కిన వా
రిని పలు మారులు గణించిరి యని గని హితుల్
కనపడని పదవ వానిగ
తననే చూపగ నెరింగి దక్కెననుకొనెన్

తనను విడిచి వెదికిన దొర
కని పదవ సహచరుని వలె కనలేమాత్మన్
తను కనుగొన దలచిన నా
త్మను తానేయని యెరింగి తననరయదగున్

తలపులె మనుజుల తగువులు తంటల్
తలచిన తడవునె తమసును పెంచున్
తలచెడి దెవరని తలచిన  పోవున్
తలపులు తొలగిన తమకము పోవున్

ఆలోచన యనిన -నక్కడ లోచన
 మాలోచనే యాన-మత్తరికిని
నాలోచనేయగు -నావేశతాపాదు
 లాలోచనేయగు-నారు యరులు
నాలోచనేహేతు-వన్ని కష్టములకు
 నాలోచనేశత్రు -వందరికిని
నెల్లపుడుండిన -నిప్పుడే యిక్కడే
 యన్ని యాలోచన-లంత మగును

తలపులె మన కన్ని-తంటలనిచ్చును
తలచు వాడెవరని  -తలచిన తన
తలపులు తొలగునని -తలచుచు మనసుకు
తలుపు మూయ దగును -తక్ష ణంబు

తలపులె మనుజుల కలతలు
తలచిన తడవునె  మనమున తమసును పెంచున్
తలచెడి దెవరని తపముగ
తలచిన తలపులు తొలగును తమకము పోవున్

Comments