నలువిధమ్ముల దేవునర్చింత్రు ధరణిలో
సద్భక్తు లైనట్టి సత్పురుషులు
చింతలున్నప్పుడె చింతించు చిత్తము
నార్తరక్షకుడంచు నార్తుడొకడు
నైశ్వర్యమాసించి యీశ్వరునర్చించు
నట్టిద్వితీయుడర్ధార్ధియితడు
జిజ్ఞాసు ధ్యానించు సుజ్ఞాన సిధ్ధికై
దేవభక్తులలో తృతీయుడితడు
జ్ఞానమెరిగిన భక్తుడే జ్ఞాని యగును
నిత్య సత్యమునెపుడు ధ్యానించు చుండు
యోగిగాపరమాత్మతోయుండు నెపుడు
భక్తులందుత్తముడు ప్రియ భక్తుడితడు
భగవద్గీత 7.16 & 17
చతుర్విధా భజన్తే మాం జనాః సుకృతినో అర్జున | ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ||
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ||
తాత్పర్యం
” భరత శ్రేష్ఠా ! ఆపదల్లో పడినవాడు, జిజ్ఞాసువు, సంపదలను కోరేవాడు, జ్ఞాని … ఈ నాలుగు విధాల మనుష్యులే ‘ నన్ను ’ ‘ ఆత్మ ’ ను సేవిస్తున్నారు. “
ఈ నలుగురిలో నిత్యము నాతో కూడి పరమాత్మనైన నాయందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్టుడు.అటువంటి వాడికి నేను ఎక్కువ ప్రియుణ్ణి.అతడే నాకు కూడా ఇష్టుడు.
Comments
Post a Comment