పేకాట

ఏకాలముంగనిన నాకాలమందునను పేకాటలాడదగునే
పేకాటరాయుడులు యేకాడికీవదల నాకాటలోకమనుచున్
పేకాటతోయఘులు ప్రాకారమున్నిలిపి యేకాకిలాబ్రతుకుచున్
నాకారులైయిటుల లోకాలనుమ్మరచి పేకాటతోగడపగన్

చేకావలిన్ దులిపి చేకాసులున్ కడకు జూకాలనూవదలకన్
రాకాసిలానిలిచి పేకాటనేయిలన పోకార్చుజీవితములన్
పేకాటజూదరులు ప్రాకాశమున్ దొలగి శోకాలలోముణుగునే
పోకాలమేకలిగి ఢోకాలతోనలిగి బేకారులైకుములుగా

రాకాలమందుగెలు పేఖాయమైనటుల నీకాశదేనికి సుమా
పేకాటపోవిడిచి శోకాలుమాయమగు దాకా శివున్ వదలకన్
ఈకాలమందె,దహ రాకాశమందలిని రాకారునూగొలువురా
శోకాలువైదొలగు శ్లోకాలతోదినము శ్రీకారమున్ పలుకరా!... కోట శర్మ

అనాకాలము=వేళకానివేళ; అఘులు=పాపులు; 
నాకారులు= పనికిమాలిన వారు; పోకార్చు = నాశనము చేయు; 
చేకావలి= ఇంటిలోని డబ్బు ; చేకాసులు= చేతిలోని డబ్బు ; 
ప్రాకాశము= కీర్తి, వెలుగు; దహరాకాశము= చిదాకాశము;
 ముణుచు=ముంచు; ఢోకా=మోసం.


నాకేటికాదనుచు నాకేమిపోదనుచు నాకేటిబెంగనుకొనిన్ 
పేకాటరాయుడులు పేకాటలోమునిగి పోకార్చుజీవితములన్
చేకాసులూవదిలి చేజేతులానలిగి చీకాకులేమిగులురా
పేకాటయందుగెలు పేఖాయమైనటుల పేరాశవీడుము సుమా .. కోట శర్మ 

పేకాట
ఏకాలముంగనిన నాకాలమందునను పేకాటలాడదగునే
పేకాటలోగెలిచి నేకోటలేకొనుదు నాకేటిబెంగనుకొనిన్
పేకాటతోయఘులు ప్రాకారమేనిలిపి ఏకాకిలాబ్రతుకుతూ
నాకారులైయిటుల లోకాలనేమరచి పేకాటతోగడపగా
రాకాసిలానిలిచె పేకాటనేయిలన పోకార్చుజూదరులనూ
చేకావలిన్ దులిపి చేకాసులూకడకు జూకాలనూవదలకన్
ఢోకాలతోనలిగి చీకాకులేమిగులు పీకేయగానిలువునన్
రాకాలమందుగెలు పేఖాయమైనటుల పోకళ్లుపోవలదురా
పోకాలమేకలిగి ప్రాకాశమున్ దొలగి శోకాలలోముణుచురా
నాకేటికాదనుచు నాకేమిపోదనుచు బేకారుమాటలిడిచీ
పేకాటపోవిడిచి శోకాలనేకములు నాకేలకావుమనుచూ
లోకేశుకోరు,దహ రాకాశమందలిని రాకారునూగొలువురా
శోకాలువైదొలగు శ్లోకాలతోదినము శ్రీకారమున్ పలుకరా!... కోట శర్మ
అనాకాలము=వేళకానివేళ; అఘులు=పాపులు; 
నాకారులు= పనికిమాలిన వారు; పోకార్చు = నాశనము చేయు; 
చేకావలి= ఇంటిలోని డబ్బు ; చేరకాసులు= చేతిలోని డబ్బు ; 
పోకళ్లు= గొప్పలు; ప్రాకాశము= కీర్తి, వెలుగు; 
దహరాకాశము= చిదాకాశము; ముణుచు=ముంచు; 
ఢోకా=మోసం.



Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్