నీటిఆవకాయ సార్ధకనామధేయి
నేడు నూతననీటిఆవకాయ సీమాంతర గమనానంతరం
గృహాగమనం చేసెనని గ్రహించి బహుసంతోషతరంగితస్వాంతుడనై
వేగిరమోగిరమారగింపదలంచి ఉష్ణోదనాజ్యజలావకాయ మిశ్రమ
మోదకమును మద్దంతాలయమునన్ ప్రవేశింపజేయ జిహ్వస్పర్శనంగావించి
రసాస్వాదనానందమున అప్రయత్నంబుగ ఆహాహాయని అరవంగ
ఆ థేనుదారఘాటు (ఆవాలఘాటు)
నాసికారంధ్రములంజొచ్చి
కర్ణకుహరద్వయస్ధంభనమున తాత్కాలిక శృతివర్జితుండనైన పిమ్మట
తెప్పరిల్లి తేఱుకుని నాకంట నీరు జాలువ్రాలుటనెరింగి
ఈ కన్నీరు నీటిఆవకాయ రసాస్వాదనానందభాష్పములా లేక
ఆవఘాటుఘాతసంభూతాశ్రుధారలా యని సంశయించుచుండ నాకనిపించెన్
కంట నీరు రప్పిస్తుంది కాన నీటిఆవకాయ సార్ధకనామధేయియని.
ఆవఘాటురసానందం
బ్రహ్మానందసమానం
నీలకాయమోహనుని భజింతు
భక్తులకు కలుగు తురీయం
ఆవకాయోదనం భుజింతు
భోక్తలకు కలుగు తురీయాతీతం
భక్తుల రక్షణార్ధం నీలకాయ
భోక్తల భక్షణార్ధం ఆవకాయ
......కోట శర్మ
Comments
Post a Comment