మరువతరమా నాకు నాన్నా తరముతరములకైన నిన్ను
ధర్మోరక్షతి రక్షితంటూ నానుడెన్నడు వీడవైతివి
లేనివారికి ఉన్నవారితో ఉన్నదేదో అప్పగిస్తూ
మరువతరమా నాకు నాన్నా తరముతరములకైన నిన్ను
తెల్లవారితె అయ్యవారికి నింగినేలను తడపమంటూ
రుద్రపఠనతో నీళ్లుపోస్తూ శివునిప్రీతికి పాత్రుడైతివి
మరువతరమా నాకు నాన్నా తరముతరములకైన నిన్ను
కానిదైతే చిల్లికాని కూడనాకది వల్లదంటూ
చీకులేదూ చింతలేదూ కల్లకపటము లేనెలేదు
మరువతరమా నాకు నాన్నా తరముతరములకైన నిన్ను
ఎఱుకకోసం ఊళ్లు వెతికి వెతకవలసిందేది లేదని
లేదనన్నది కోటలోనే
ఉన్నదంటూ తేల్చిచెప్తివి
మరువతరమా నాకు నాన్నా తరముతరములకైన నిన్ను
రామసీతలనొకటి చేసి సీతారాములు నీవె కాగా
తండ్రివైతివి దేవుడైతివి సఖుడునీవే గురువునీవే
మరువతరమా నాకు నాన్నా తరముతరములకైన నిన్ను
...... కోట శర్మ

Comments
Post a Comment