తత్వ చింతన - అవస్థాత్రయ వివరణ

కం. మెలకువ నిదుర కలలను
      త్రిలోక ములలో మనుజుడు తిరుగును నిలలో
      మెళుకువతో లోకమ్ములు
      తిలకించగ విదితమగును తీరు తరింపన్

కం. మెలగును తనువూ మనసూ
       మెలకువలో, మనసొకటియె మెదలును కలలో
       కలిపించి లేని జగతిని,
       కలలుకనని నిదురలోన కనబడ వేవీ!

కం. మెలకువ లో కనబడునవి
       కలలో నుండవు, కలిపిత కల కనుమరుగౌ
       మెలకువలో, మాయమగు స
       కలము నిదురలో, సకలము కనునది నీవే.... కోట శర్మ

ఛందస్సు లో దోషములున్న దయచేసి తెలియజేయగలరు 🙏

వివరణ: జ్ఞాన మార్గమున ఆత్మవిచారణకు తద్వారా అపరోక్షానుభూతికి అవస్థాత్రయ పరిశీలన మావశ్యకము.
జాగ్రదావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అనగా గాఢనిద్రలు అందరికీ అనుభవములోనున్న విషయాలే.

మెలకువగా ఉన్నప్పుడు మనిషి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతో పాటు అంతఃకరణముతో వ్యవహరిస్తాడు.
కాని కలలో కేవలము మనసుతో మాత్రమే మెలగును. కలలు లేని గాఢనిద్ర యందు మనసుకాడా వ్యవహరించదు. కలలో వస్తువులు ప్రాతిభాసికాలు అనగా మిథ్య అయి ఉంటాయి. ఆవస్తువులే మెలకువలో స్థిరంగా, వ్యావహారికంగా ఉంటాయి. కాని ఈ రెండు అవస్థల్లోనూ కలిగే జ్ఞానం మాత్రం ఒకటే.

గాఢనిద్రనుండి మేల్కొన్న వ్యక్తికి, నిద్రలో తనకు ఏమీ తెలియలేదు అనే అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం స్మృతిరూపంలో ఉంటోంది. అనుభవం లేకపోతే దాని జ్ఞాపకమే ఉండదు కదా! కాబట్టి గాఢనిద్ర లో "ఏమీ తెలియకపోవటం అనేది " అనుభవమైనదని తెలుస్తోంది. ఈ అజ్ఞానానుభవస్మృతే మేల్కొన్నప్పుడు కలుగుతోంది. కాబట్టి గాఢనిద్రలో బాహ్యకరణములు, అంతఃకరణము పనిచేయకపోయినప్పటికీ, జ్ఞానముంటుందని తెలుస్తోంది.

మూడుస్థితులలోనూ మారిపోతున్న వస్తువులను తాను మారకుండా, సాక్షీరూపంగా, ఏకరూపంగా గమనిస్తున్న జ్ఞానమే ఆత్మ స్వరూపము. నీ అసలు రూపము.. కోట శర్మ

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్