తత్వ చింతన

సీ.హారకేయూరాది-యాభరణంబులు
   వేరుగా ననిపించు - వేరు గావు
   నశియించెడివి రూప- నామంబు లగువేరు
   మారనట్టి కనక - మవదు వేరు
   అలలు బుద్బుదఫేన - లగుపించు వేరుగ
   ఆధారమగు నీర - మవదు వేరు
   నీరుబంగారముల్ - తీరుగ సత్యమె
   అనయమౌ బ్రహ్మము - కసలు రూపు
తే.రూపనామముల్ జగతికి - రూపమగును
     భాతి యస్థి ప్రియములె యా - బ్రహ్మ రూపు
     నామరూపములనువీడి - నపుడు  మనమె
     అద్వితీయమౌ బ్రహ్మము- నరయ గలము
       ...కోట శర్మ
వివరణ:
గొలుసు, గాజులు వంటి ఆభరణములు వేరు వేరు గా కనిపించినను అవి కేవలము నామ రూపములు గానే భిన్నములు. వాటికి ఉపాదానకారణమైన బంగారమే వాటి అసలు రూపము. బంగారముగా అవి అభిన్నములు. నామరూపములు త్యజించి చూడగా అవన్నీ ఒక్కటిగానే ( బంగారము గానే) గోచరిస్తాయి. బంగారము ఆ ఆభరణములు తయారు చేయకముందు, చేసిన తరువాత, అలాగే వాటిని కరిగించిన తరువాత కూడా ఉంటుంది. కాటట్టి బంగారము నిత్యము, సత్యము. కాని ఆభరణములు తయారుచేయటానికి ముందు లేవు. అలాగే వాటిని కరిగించాక ఉండవు కావున అనిత్యములు.

ఇదేవిధంగా బంగారు కంటే భిన్నంగా ( అంటే బంగారము మినహాయిస్తే) గాజులు, గొలుసు వంటి ఏ ఆభరణమూ ఉండదు. కనుక బంగారము సత్యము మరియు ఆధారము. ఆభరణములు అసత్యము మరియు ఆధేయము.
అలాగే జలము కంటె అలలు, నురుగు, బుడగలు ఎట్లు వేరు కావో, అట్లే విశ్వోపాదాన కారణమైన ఆత్మ కంటె ప్రపంచము వేరు కాదు. ఏవిధంగా తరంగ బుద్బుదాదులందు జలము అనుగతమై యున్నదో, అట్లే శుద్ధ చైతన్యము సంపూర్ణవిశ్వమునందనుగతమై యున్నది.
"అస్తి భాతి ప్రియం రూపం నామ చేత్యంశపంచకమ్ ।
ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం ।।" - దృక్ దృశ్య వివేకము.
అనగా అస్తి - ఉన్నది/ సత్ , భాతి  - ప్రకాశించుచున్నది/ చిత్ / చైతన్యము, ప్రియం - ప్రియమైనది / ఆనందము, రూపము, నామము అను ఈ ఐదు అంశములు సమస్త ప్రపంచమునందు వ్యాప్తమై యున్నవి. వీటిలో"అస్తి-భాతి-ప్రియం" అను మొదటి మూడు అంశములు బ్రహ్మ (ఆత్మ) సంబంధమైనవిగా ప్రపంచమునందు స్థితి గలిగి యున్నవి. నామరూపములు రెండును జడ జగత్తుకు సంబంధించినవి. నామరూపములు ఎల్లప్పుడును ఒకేస్థితిలో నుండని కారణముచేత అవి వినాశములు. నామరూపముల రెంటిని త్రోసివేసినచో మిథ్యా జగత్తుకు సంబంధించినదేదీ మిగలక సచ్చిదానందరూపమైన బ్రహ్మానుభూతి కలుగుతుంది. ( Based on Ashtavakra Gita and Drik Drisya Vivekamu)

Comments

Popular posts from this blog

ఈశావాశ్యోపనిషత్